పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో 8 స్థానాలలో పోటీ చేయబోతోంది. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ జనసేనకు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందలేదు కనుక దాని ఎన్నికల చిహ్నామైన గ్లాసు గుర్తును కేటాయించలేదు. తెలంగాణలో అందరికీ తెలిసిన 4-5 పార్టీలు కాకుండా మరో 65 పార్టీలున్నాయి. వాటన్నిటికీ ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉంది.
ప్రజలకు పెద్దగా తెలీని ఆ పార్టీలన్నిటికీ ఎప్పటిలాగే నిర్ధిష్టమైన ఎన్నికల చిహ్నాలు కేటాయించింది. కానీ అందరికీ చిరపరిచితుడైన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనకు ఎన్నికల చిహ్నం లభించలేదు. ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నప్పుడు ముందే జాగ్రత్త పడి కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకొని ఉండి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేదే కాదు. జనసేనకు ఎన్నికల చిహ్నం లభించనందున 8 మంది అభ్యర్ధులు స్వతంత్ర అభ్యర్ధులుగా వేర్వేరు ఎన్నికల గుర్తులతో పోటీ చేయవలసి ఉంటుంది.