సంగారెడ్డి అభ్యర్ధి దేశ్ పాండేకు బీజేపీ షాక్!

కొద్ది సేపటి క్రితమే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్స్‌ గడువు ముగిసింది. కానీ చివరి నిమిషం వరకు పార్టీలు తమ అభ్యర్ధులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. సంగారెడ్డి బీజేపీ అభ్యర్ధిగా దేశ్ పాండే రాజేశ్వర్ రావుని ప్రకటించింది. కానీ నామినేషన్ వేసే సమయానికి ఆయనకు బదులు పులిమామిడి రాజుకి బీ-ఫారం ఇవ్వడంతో ఆయన పరుగున వెళ్ళి నామినేషన్ వేశారు. 

దీంతో షాక్ అయినదేశ్ పాండే రాజేశ్వర్ రావు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నుంచే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి, “నేను ఏమి తప్పు చేశానన్నా నాకు ఇంత అన్యాయం చేశావు?టికెట్ ఇస్తున్నామని చెప్పి చివరి నిమిషంలో నన్ను ఇలా మోసం చేస్తావా? నియోజకవర్గంలో ప్రజల ముందు నా పరువు తీసేశావు కదయ్యా?నాకు ఇక వేరే దారిలేదు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంటాను,” అంటూ నడిరోడ్డుపై నిలబడి కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతా పెద్దాయన అలా రోడ్డుపై కన్నీళ్ళు పెట్టుకొంటుంటే దారినపోయే జనం, అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా అయ్యో పాపం అని బాధపడ్డారు.