ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు భగభగమండుతున్నాయి. అభ్యర్ధుల విడుదల చేసిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీకి పలువురు సీనియర్ నేతలు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. టికెట్స్ రాని నేతల అనుచరులు గాంధీ భవన్ ఎదుట ధర్నాలు చేస్తూనే ఉన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వేరే పార్టీలలో చేరి లేదా పార్టీపై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటివన్నీ సర్వసాధారణమే అనిపించవచ్చు.కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టికెట్ దక్కని నేతల అసంతృప్తి చాలా పెరిగిందని అర్దమవుతోంది. ఇందుకు కారణం ఈసారి కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తుండటమే కావచ్చు.
కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి చివరి జాబితా ప్రకటించగానే మళ్ళీ టికెట్ దక్కని నేతల భగభగలు మొదలయ్యాయి. తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్ తప్ప మిగిలిన నలుగురు పార్టీపై తిరుగుబాటుకి సిద్దమయ్యారు.
పటాన్చెరు నుంచి టికెట్ పొందినప్పటికీ బీ-ఫారం పొందలేకపోయిన నీలం మధు బీఎస్పీలో చేరిపోయి నేడు నామినేషన్ వేస్తున్నారు. అలాగే సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేస్తున్నారు. మిర్యాలగూడలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్కు విజయావకాశాలు కనిపిస్తుంటే, పార్టీలో చెలరేగుతున్న ఈ అసంతృప్తి సెగలు కాంగ్రెస్ కొంప ముంచేలా ఉన్నాయి.