పటాన్‌చెరు అభ్యర్ధి నీలం మధుకి హ్యాండిచ్చిన కాంగ్రెస్‌

ఇటీవల విడుదల చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాలో పటాన్‌చెరు అభ్యర్ధిగా నీలం మధు ముదిరాజ్‌ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ సీనియర్ కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ అధిష్టానం మీద ఒత్తిడికి తలొగ్గి ఆయన స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్‌ని అభ్యర్ధిగా నిన్న ప్రకటించింది. అందుకే నీలం మధుకి నిన్న బీ-ఫారం కూడా ఇవ్వలేదు. నామినేషన్స్ దాఖలు చేసేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉన్నందున ఇక అభ్యర్ధులను మార్చే అవకాశం కూడా లేదు. కనుక పటాన్‌చెరు నుండి కాట శ్రీనివాస్ గౌడ్‌ పోటీ చేయడం ఖాయం అయ్యింది.

అయితే ముందుజాగ్రత్త చర్యగా ఆయన భార్య, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  కాట సుధ గౌడ్‌ నిన్ననే నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు భర్తకు టికెట్‌ ఖరారు కావడం ఆమె ఉపసంహరించుకోనున్నారు.   

నీలం మధుని మార్చే ప్రయత్నం చేస్తే నా నిర్ణయం నేను తీసుకొంటానని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని హెచ్చారించారు. అదే జరిగింది కనుక ఇప్పుడు ఆయన ఏమి చేస్తారో? నీలం మధు ఏమి చేయబోతున్నారో చూడాలి.