కామారెడ్డితో నా అనుబందం ఇప్పటిది కాదు: కేసీఆర్‌

నేడు సిఎం కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో నామినేషన్స్‌ వేసిన తర్వాత కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి జిల్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ చాలా భావోద్వేగంతో మాట్లాడారు. 

“కామారెడ్డి జిల్లాతో నాకున్న అనుబందం ఇప్పటిది కాదు. మా తల్లిగారు ఈ జిల్లాలోనే కోనాపూర్ అని మనం ఇప్పుడు పిలుచుకొంటున్న పోసానిపల్లిలో జన్మించారు. ఆవిదంగా ఈ జిల్లాతో నాకు ఏర్పడిన అనుబందం తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంకా బలపడింది. ఇక్కడే 45 రోజులపాటు జలసాధన ఉద్యమం చేశాము. తెలంగాణ ఉద్యమం కోసం బ్రిగేడియర్లను ఏర్పాటు చేసుకోగా దానిలో కామారెడ్డికి నేనే బ్రిగేడియర్‌గా వ్యవహరించాను. అది తలుచుకొన్నప్పుడు నేటికీ నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంటుంది. ఇంత అనుబందం ఉన్నందునే కామారెడ్డి నుంచి పోటీ చేయమని గోవర్ధన్ నన్ను చాలాసార్లు అడిగారు. కానీ ఇన్నేళ్ళకు నాకు ఈ అవకాశం లభించింది. ఇది దైవకృపగానే భావిస్తున్నాను,” అని అన్నారు. 

తెలంగాణ ఏర్పడితే కామారెడ్డిని జిల్లాని చేస్తానని మాటిచ్చాను. అలాగే చేశాను. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకొన్నాము. జిల్లాను అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చేసుకొన్నాము. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈసారి కామారెడ్డి పట్టణం, జిల్లాలోని పల్లెల రూపురేఖలను మార్చేసుకొందాము. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాలకు త్రాగు, సాగునీరు అందిస్తాను,” అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.