ఆర్మూరులో వాహనంపై నుంచి జారిపడిన కేటీఆర్‌

ఈరోజు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ బిఆర్ఎస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి నామినేషన్ ఊరేగింపు కార్యక్రమంలో చిన్న అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌, ఎంపీ సురేశ్ రెడ్డి ఆయనతో కలిసి ప్రచార వాహనంపై నిలుచొని ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరగా దారిలో పాత ఆలూర్ రోడ్డులో వారి వాహనం ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.

పైన నిలబడున్న కేటీఆర్‌తో సహా అందరి బరువు రెయిలింగ్‌పై పడింది. దాంతో రెయిలింగ్ ఊడిపోయి కేటీఆర్‌తో సహా ముగ్గురూ ముందుకు తూలిపడ్డారు. అయితే వెంటనే వాహనం పైనున్న మిగిలినవారు వారిని పట్టుకొని పైకి లాగారు. ఈ ప్రమాదంలో కేటీఆర్‌తో సహా ఎవరికీ గాయాలు కాలేదు. తర్వాత కేటీఆర్‌ తదితరులు వెంటరాగా జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 

అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లాలో తన నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్లా నుంచి కేటీఆర్‌ వరుసగా 5వ సారి పోటీ చేయబోతున్నారు.