అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక బిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెదక్ ఎంపీ ఇటీవల కత్తిపోటుకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇవాళ్ళ నామినేషన్ వేసేందుకు హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు వచ్చారు. రిటర్నింగ్ ఆఫీసరుకి ముందే ఈ విషయం తెలియజేయడంతో ఆయన కోసం వీల్ చైర్ సిద్దంగా ఉంచారు. అంబులెన్సులో నుంచి దిగి దానిలో కూర్చొని లోనికి వెళ్ళి ఆర్వో గరిమ అగర్వాల్‌కు  నామినేషన్ సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయనని కూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ వేసిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని, వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. తన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.