సభకి వస్తే 500 ఇస్తామన్నారుగా.. ఇవ్వనంటే కుదరదు!

రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి ఎప్పుడో పోయిందనేది వాస్తవం. అందుకే స్థానిక నాయకులు జనసమీకరణ చేస్తుంటారు. జనసమీకరణ కూడా ఊరికే కాదు. ఏ పార్టీ మీటింగ్, ఎక్కడ, ఎన్ని గంటలకు, ఎండలోనా లేదా సాయంత్రం చల్లబడిన తర్వాతా... ఊరికి ఎంత దూరంలో ఉంది... బస్సులు, ఆటోలు సదుపాయం కల్పిస్తున్నారా... బిర్యాని, మందు బాటిల్ ఏవైనా ఇస్తారా లేదా వంటి లెక్కలన్నీ ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఒక్కో మనిషికి ఇంత అని నిర్ణయించి చెల్లిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన టాప్ సీక్రెట్.

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి తరపున నిన్న పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభకి అలాగే జనసమీకరణ చేశారు. ఆ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సభకు హాజరైతే ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున చెల్లిస్తామని చెప్పి తీసుకువచ్చారని కానీ సభ ముగిసిన తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారంటూ సభకు వచ్చినవారు కంది శ్రీనివాస్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. వారందరికీ ఆయన డబ్బు చెల్లించిన తర్వాత కానీ శాంతించలేదు.