పొంగులేటి ఇళ్ళు, కార్యాలయాలపై ఐ‌టి రెయిడ్స్!

ఆదాయపన్ను, ఈడీ అధికారులు గురువారం తెల్లవారుజామున 3 గంటలకే పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలకు చేరుకొని సోదాలు ప్రారంభించారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్, వంశీరామ్ జ్యోతి హిల్ రిడ్జ్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రాఘవ ఫ్రైడ్ ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వర రావు ఇంటిపై కూడా బుధవారం ఐ‌టి అధికారులు దాడి చేశారు. అంతకు ముందు పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పుడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఇంటిపై కూడా ఐ‌టి దాడులు జరుగవచ్చని చెప్పారు. ఆయన ఊహించిన్నట్లే ఈరోజు తెల్లవారుజామునే ఐ‌టి, ఈడీ అధికారులు ఆయన ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేశారు. 

తాను నామినేషన్ వేసేందుకు సిద్దమవుతుంటే ఐ‌టి, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం రాజకీయకుట్రే అని అన్నారు. బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు అయినప్పటికీ ఓటమి భయం పట్టుకొందని అందుకే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ ఇళ్ళపై ఐ‌టి దాడులు చేయిస్తోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.