తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. నామినేషన్స్ దాఖలు చేసేందుకు శుక్రవారం వరకే గడువు ఉండటంతో, టికెట్ లభించని నేతలు చివరి నిమిషం వరకు అధిష్టానం మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ పోటీ చేయాలనుకొన్నారు. కానీ ఆవుల రాజిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఓ పక్క పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూనే, బుధవారం తన అనుచరులతో కలిసి వెళ్ళి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు రేపటిలోగా తప్పకుండా బీ-ఫార్మ్ ఇస్తుందనే నమ్మకం ఉందని అందుకే నామినేషన్ వేశానని అనిల్ కుమార్ చెప్పారు. తనకు అవకాశం ఇస్తే నర్సాపూర్‌లో బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగురవేయగలనని చెప్పారు. కాంగ్రెస్ టికెట్ పొందిన రాజిరెడ్డి బలమైన బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేరని కనుక ఆయన కాంగ్రెస్ గెలుపుకోరుకొంటే స్వచ్ఛందంగా తప్పుకొని తనకు సహకరిస్తే బాగుతుందని అనిల్ కుమార్ అన్నారు.