
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యూట్యూబ్ ఛానల్‌తో మంచి పేరు సంపాదించుకొన్న తీన్మార్ మల్లన తన శక్తిసామర్ధ్యాలను, ప్రజాధరణను చాలా ఎక్కువగా ఊహించుకొని, కేసీఆర్‌ని ఓడించేస్తానంటూ రాష్ట్రంలో పర్యటిస్తూ చాలా హడావుడి చేశారు. కానీ ప్రభుత్వం తలుచుకొంటే తన పరిస్థితి ఎలా మారిపోతుందో గ్రహించిన తర్వాత రక్షణ కోసం రాజకీయ పార్టీలలో చేరడం అవసరమని గ్రహించారు.
మొదట కాంగ్రెస్ తర్వాత టీజేఎస్, బీజేపీలోకి మారారు. కానీ వాటిలో ఇమడలేక బయటకువచ్చేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికే తిరిగి వచ్చారు.
ఈ ఎన్నికలలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా మంత్రి మల్లారెడ్డి మీద పోటీ చేసి ఓడిస్తానని శపధం చేశారు. అక్కడి నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించి, ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానానికి తోటకూర్ వ్రజేష్ యాదవ్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది. బహుశః ఆయనను పక్కన పెట్టి తీన్మార్ మల్లనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగుస్తుంది కనుక ఈరోజే ఈవిషయం తేలిపోతుంది.