నీలం మధుకి షాక్... బీ-ఫార్మ్ లేదట!

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడవ జాబితాలో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ ఖరారు చేయడం, ఆ టికెట్‌ ఆశిస్తున్న కాట శ్రీనివాస్ రెడ్డి అనుచరులు రోడ్డెక్కి రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం అందరూ చూశారు. కాట శ్రీనివాస్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్‌ నేత దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి చేస్తుండగా, నీలం మధునే బరిలో దింపాలని జగ్గారెడ్డి పట్టుబడుతున్నారు.

ఈ పరిణామాలతో అప్రమత్తమయిన నీలం మధు, ఈరోజు మధ్యాహ్నం హడావుడిగా ముందు బీ-ఫారం తీసుకొనేందుకు గాంధీ భవన్‌కు వెళ్ళగా, అక్కడ ఉన్న సీనియర్ నేతలు ఇంకా ఢిల్లీ నుంచి అనుమతి రాలేదని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.

కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాలో తన పేరు ప్రకటించి ఇప్పుడు బీ-ఫారం ఇవ్వకపోవడంలో అర్దం ఏమిటని గట్టిగా నిలదీశారు. అయితే ఢిల్లీ నుంచి అనుమతి వస్తే తప్ప బీ-ఫారం ఇవ్వలేమని వారు తేల్చి చెప్పడంతో నీలం మధు తీవ్ర ఆగ్రహావేశాలతో గాంధీ భవన్‌ నుంచి బయటకు వచ్చేశారు.

ఒకవేళ బీ-ఫారం ఇవ్వకపోతే ఏమీ చేయాలనే దానిపై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వారిద్దరిలో ఎవరికి బీ-ఫారం ఇస్తుందో?