నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు బాన్సువాడ నుంచి టికెట్ ఆశించగా, కాంగ్రెస్ అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలరాజు బుధవారం ఉదయం బాన్సువాడలోని కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి భావోద్వేగంతో అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడిన తర్వాత వెంటతెచ్చుకొన్న పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
పక్కనే ఉన్న అనుచరులు ఆయనను అడ్డుకొనేలోగా పురుగుల మందు డబ్బాలో కొంత త్రాగేసి నురగలు కక్కుకొంటూ కిందపడిపోయారు. అనుచరులు హుటాహుటిన ఆయనను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స చేసి నిజామాబాద్ తీసుకువెళ్ళవలసిందిగా వైద్యులు సూచించారు. వెంటనే నిజామాబాద్ తరలించారు. అక్కడ వైద్య చికిత్స అనంతరం కాసుల బాలరాజు కొలుకొన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.