
వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులే. ఇద్దరికీ టికెట్స్ కూడా లభించాయి. కానీ ఇద్దరూ కత్తులు దూసుకొంటున్నారు. వారే దామోదర రాజనర్సింహ (ఆందోల్), జగ్గారెడ్డి (సంగారెడ్డి). ఇద్దరూ వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు వారి మద్య గొడవేమిటి? అనుకోవచ్చు. వారు తమ నియోజకవర్గాల విషయంలో గొడవపడటం లేదు. పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధు ముదిరాజ్ విషయంలో గొడవపడుతున్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన వద్ద నుంచి భారీగా డబ్బు దండుకొని టికెట్ ఇచ్చారని పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మూడో జాబితాలో నీలం మధుకి టికెట్ కేటాయించిన్నట్లు ప్రకటించగానే ఆయన అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కాట శ్రీనివాస్ రెడ్డికి దామోదర రాజనర్సింహకు సన్నిహితుడు కావడంతో ఆయన కొరకు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే జగ్గారెడ్డికి నీలం మధు సన్నిహితుడు కావడంతో ఆయన కూడా వెంటనే రంగంలో దిగి, ‘మధుని మారిస్తే సహించబోనని, నా నిర్ణయం నేను తీసుకొంటానని’ కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది. కానీ రెండు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న కాట శ్రీనివాస్ రెడ్డిని కాదని పార్టీలో కొత్తగా వచ్చిన నీలం మధుకి టికెట్ ఎలా ఇస్తారని దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి కూడా నీలం మధుకే మద్దతు ఇస్తున్నారు కనుక ఆయనే పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్ధిగా కొనసాగవచ్చు.