తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని పార్టీలో, ప్రజలలో గట్టి నమ్మకం కలిగించిన వ్యక్తి ఎవరంటే నిసందేహంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. అయితే కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి ఇంకా పలువురు సీనియర్ నేతలు మాత్రం నేటికీ రేవంత్ రెడ్డి నాయకత్వన్నే అంగీకరించడం లేదు. ఇక ముఖ్యమంత్రి అవుతానంటే ఒప్పుకొంటారా? “కర్ణాటక నుంచి ఎవరో వచ్చి ఏదో చెపితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోలేరని నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని” కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదేపదే చెపుతున్నారు.
అందుకే “కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?” అని బిఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నా ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్ధి నేడు తన నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా మా ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్ రెడ్డే. డిసెంబర్ 9వ తేదీన రేవంత్ అన్నే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. భూమి బద్దలైనా ఇదే జరిగి తీరుతుంది,” అని రేవంత్ రెడ్డి సమక్షంలోనే అన్నారు.