నన్ను కాదని సీపీఐకి టికెట్‌ ఇస్తే ఊరుకోను: ఎడవెల్లి కృష్ణ

శాసనసభ ఎన్నికలలో సీపీఎం పార్టీ  కాంగ్రెస్‌తో పొత్తుకి ప్రయత్నించి, కోరిన సీట్లు లభించకపోవడంతో 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సీపీఐకి మాత్రం కొత్తగూడెం టికెట్‌ ఇచ్చి బుజ్జగించడంతో అది సర్దుకుపోయేందుకు సిద్దపడింది. 

కొత్తగూడెం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఎడవెల్లి కృష్ణ ఈరోజు విలేఖరులతో మాట్లాడుతూ, “నేను ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని పనిచేస్తున్నాను. కానీ పార్టీ నన్ను కాదని సీపీఐకి టికెట్‌ ఇచ్చింది. ఇది చాలా తప్పు, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నామినేషన్స్‌ వేసేందుకు ఇంకా మూడు రోజులు గడువు ఉంది. కనుక పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేదా కాంగ్రెస్‌ అధిష్టానం లేదా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కలుగజేసుకొని నాకు బీ ఫామ్ ఇస్తే నేను కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నామినేషన్స్‌ వేస్తాను. లేకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తాను. నేను పోటీ చేస్తే సీపీఐ అభ్యర్ధికి కనీసం డిపాజిట్ కూడా దక్కదు. అయినా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు సీపీఐతో పొత్తుపెట్టుకోవలసిన అవసరం ఏముంది?” అని ప్రశ్నించారు. 

అశ్వారావుపేట టికెట్‌ దక్కక పోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నారు.