
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం చేరుకొని 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఈరోజు సభకు రెండు ప్రత్యేకతలున్నాయి. బీజేపీ-జనసేనల పొత్తులు కుదిరినందున ఈ సభలో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని బీజేపీకి మద్దతు ప్రకటిస్తారు. బహుశః జనసేన అభ్యర్ధులను కూడా ఈ వేదిక మీద నుంచే ప్రకటించి వారిని గెలిపించవలసిందిగా కోరే అవకాశం ఉంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. కనుక ఈరోజు సభలో ప్రధాని మోడీ బీజేపీ బీసీ అభ్యర్ధి పేరు ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.