కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి 16 మంది అభ్యర్ధులతో మూడవ (తుది)జాబితా విడుదల చేయగానే, ఆ స్థానాలలో పోటీ చేయాలనుకొని టికెట్ దక్కని నేతలు, వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాట శ్రీనివాస్ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, పార్టీలో కొత్తగా చేరిన నీలం మధు ముదిరాజ్‌కు టికెట్ లభించింది. దీంతో కాట శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నిన్న రాత్రి పటాన్‌చెరులో రోడ్లపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసనలు తెలిపారు.
ఆయన సతీమణి కాట సుధ విలేఖరుల ఎదుట కన్నీళ్ళు పెట్టుకొన్నారు. “మేము గత రెండు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ కష్టకాలంలో అందరూ పార్టీని విడిచి వెళ్ళిపోయినా మేము మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నాము. పార్టీని కాపాడుకొంటూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకొనేందుకు మేము మా ఆస్తులను సైతం అమ్ముకొన్నాము. కానీ పార్టీ కోసం ఇంత చేస్తే మాకు టికెట్ ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకి టికెట్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి నీలం మధుకి ఈ టికెట్ అమ్ముకొన్నారని మాకు తెలుసు. అయినా మేము పార్టీ మీద నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ అధిష్టానం కూడా మమ్మల్ని ఢిల్లీకి పిలిచి టికెట్ మాకే ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మోసం చేసింది. ఈ టికెట్ కోసం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి నీలం మధు నుంచి ఎంత సొమ్ము తీసుకొన్నారో సాక్ష్యాధారాలతో సహా బయటపెడతాము. త్వరలోనే మా కార్యాచరణ ప్రకటిస్తాము,” అని కాట సుధ అన్నారు.