
తెలంగాణ బీజేపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విజయశాంతి గతంలో కాంగ్రెస్ జెండా మోశానని, ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఇమడలేకపోతున్నాన్నట్లు ట్వీట్ చేశారు. బిఆర్ఎస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని ట్వీట్ చేశారు. ఆమె పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారనే అనుమానంతోనే బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తే, లోక్‌సభ ఎన్నికలలో మెదక్ సీటు ఇస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెకు ఆఫర్ చేసిన్నట్లు తాజా సమాచారం. ఇదివరకు ఆమె మెదక్ నుంచి ఎంపీగా ఉన్నారు కనుక ఈ ఆఫర్ ఆమెకు ఆమోదయోగ్యమే కావచ్చు. కనుక త్వరలోనే ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
ఆమెతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుకొని మళ్ళీ రంగారెడ్డి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది. డికె అరుణ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆమె ఖండిస్తున్నా ఒకవేళ వారు ముగ్గురూ బీజేపీని వీడితే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.