ఆత్మసాక్షి సర్వే: మరోసారి బిఆర్ఎస్ అధికారంలోకి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బిఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏది గెలుస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బండి సంజయ్‌ మార్పుతో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారై, ఈ రేసులో వెనకబడిపోగా, కర్ణాటకలో గెలిచి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ పుంజుకొంది. కనుక ఇప్పుడు బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలో ఏది గెలుస్తుందనే చర్చ జరుగుతోంది. 

ప్రజలలో నెలకొన్న ఈ ఉత్కంఠని గమనించిన అనేక మీడియా, సర్వే సంస్థలు సర్వేలు చేసి తమ నివేదికలు ప్రకటిస్తున్నాయి. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ ప్రకటించిన సర్వే నివేదికలో ఈసారి కూడా బిఆర్ఎస్‌ పార్టీయే గెలిచి అధికారంలోకి రావచ్చని సూచించింది. దాని తాజా నివేదిక ప్రకారం బిఆర్ఎస్‌: 64-70 సీట్లు, కాంగ్రెస్‌: 37-43, బీజేపీ: 5-6, మజ్లీస్‌: 6-7, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకోవచ్చు.

దాని నివేదిక ప్రకారం బిఆర్ఎస్‌: 42.50%, కాంగ్రెస్‌: 36.5%, బీజేపీ: 10.75%, మజ్లీస్‌: 2.75%, ఇతరులు: 7.5% సాధించవచ్చు. 

ఈ లెక్కన 2018, డిసెంబర్‌ ఎన్నికలతో పోలిస్తే బిఆర్ఎస్‌కు 4.3% తగ్గబోతుండగా, కాంగ్రెస్‌కు 8.07% పెరుగబోతోంది. బీజేపీకి 3.77%, మజ్లీస్‌: 0.04% పెరుగుతుంది. ఇతరులు: 7.58% ఓట్లు తగ్గబోతున్నాయని శ్రీ ఆత్మసాక్షి నివేదికలో పేర్కొంది.