కర్ణాటకలో ఏం పీకారని తెలంగాణలో గెలిపించాలి?

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బిఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలు మూడూ కూడా రోజుకో కొత్త అస్త్రం బయటకు తీసి ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు మంత్రి కేటీఆర్‌ ధీటుగా జవాబులు ఇస్తున్నారు. 

నేడు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలకు ప్రజలు దశాబ్ధాలపాటు అధికారం, అవకాశం ఇస్తూనే ఉన్నారు. కానీ రెండు పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయలేకపోగా అభివృద్ధి నిరోధకాలుగా నిలుస్తున్నాయి. ఇంతకాలం కర్ణాటకను పాలించిన బీజేపీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలు గొప్పగా చెప్పుకోదగ్గ పనులు ఏమి చేశాయి? కర్ణాటకలో రైతులు కరెంటు ఇవ్వడం లేదని రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు సిద్దమంటే కర్ణాటకకు వెళ్ళి ఇది నిజమో కాదో తేల్చుకొందామా? కర్ణాటకలో ఏమీ చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణలో అధికారం లభిస్తే ఏం చేయగలవు?” అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

“ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూ, “దేశం మొత్తం మీద గత ఏడాది ఐ‌టి రంగంలో 4.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు లభించాయి. విద్యా, వైద్యం, సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు కల్పన, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఇలా ప్రతీరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీల చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది,” అని అన్నారు.