కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో టికెట్ దక్కని కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు వచ్చి ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేయాలనుకొన్న సీనియర్ కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి కూడా వారిలో ఒకరు.
కాంగ్రెస్ జెండా కిందపడిపోయినప్పుడు భుజాన్న వేసుకొని మోసిన తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దొడ్డిదారిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దూరి టికెట్ సంపాదించుకొన్నారని చలమల అన్నారు. పార్టీ అధిష్టానం కూడా పార్టీని కాపాడుకొంటున్న తనను కాదని వెన్నుపోటు పొడిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తనకు తప్పకుండా మునుగోడు టికెట్ ఇస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నానని, ఒకవేళ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని అన్నారు. కనుక అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని చలమల విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఈరోజు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ఆయనను ఈసారి కూడా ఓడిస్తామని, తమ నాయకుడు చలమలను గెలిపించుకొంటామని శపధాలు చేస్తున్నారు.
మరోపక్క మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.