కాంగ్రెస్‌లో మళ్ళీ అలకలు, రాజీనామాలు షురూ

కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 45 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేయడంతో టికెట్‌ రాని నాయకుల అందరూ మళ్ళీ అలగడం, రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు నితిన్ మావగారు నగేశ్ రెడ్డి, ఎర్ర శేఖర్ తదితరులు తీవ్ర అసంతృప్తితో రాజీనామాలకు సిద్దమయ్యారు. 

వారిలో ఎర్ర శేఖర్ నారాయణ పేట లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయాలనుకోగా ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. అదేవిధంగా నాగేశ్ రెడ్డి నిజామాబాద్‌ రూరల్ నుంచి పోటీ చేయాలనుకోగా ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేద్దామనుకొన్న విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయేందుకు సిద్దమయ్యారు. 

కాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల చేసినప్పుడే టికెట్‌ దక్కని అనేకమంది గాంధీ భవన్‌ ఎదుట ధర్నాలు చేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు వారికి మరింత మంది తోడవబోతున్నారు.