1.jpg)
మంత్రి హరీష్ రావు నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేక న్యూయార్క్‌లో ఉన్నానా?అని ఆశ్చర్యపోయారు. మన ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతగా అభివృద్ధి చేసింది. హైదరాబాద్ అభివృద్ధిని పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన రజినీకి కనిపించింది కానీ మన రాష్ట్రంలో గజినీలకు కనిపించడం లేదు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భూముల ధరలు ఎంతగా పెరిగాయో మీ అందరికీ తెలుసు.
మున్ముందు మరిన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తాయి. అప్పుడు నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. భూముల ధరలు ఇంకా పెరుగుతాయి. కానీ ఒకవేళ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోతే హైదరాబాద్ నగరం కూడా పక్కనే ఉన్న అమరావతిలా మారిపోతుంది. అమరావతిలో వ్యాపార సంస్థలు లేవు, ఐటి కంపెనీలు లేవు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన హైదరాబాద్‌కు కూడా ఆ దుస్థితే పడుతుంది. ఇంత కష్టపడి అభివృద్ధి చేసుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టి నాశనం చేసుకొందామా? మీరే ఆలోచించండి,” అని అన్నారు.