తుమ్మలని నెత్తిన పెట్టుకొంటే కాలితో తన్నాడు: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ తొలిసారిగా ఇవాళ్ళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ, “తుమ్మల నాగేశ్వర రావు నా గురించి, బిఆర్ఎస్ పార్టీ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఆనాడు పువ్వాడ అజయ్ కుమార్‌ చేతిలో తుమ్మల ఓడిపోయి ఇంట్లో కూర్చోంటే, నేను ఆయనతో దోస్తీని గౌరవించి పిలిచి మళ్ళీ టికెట్‌ ఇచ్చి ఉపఎన్నికలలో ఆయన కోసం అందరం మీ అందరినీ వేడుకొని గెలిపించుకొన్నాము. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు. 

కానీ పిలిచి ఆయనకు జిల్లా పెత్తనమప్పగిస్తే ఏం చేశారు?జిల్లాను అభివృద్ధి చేయకపోగా పార్టీకి గుండు కొట్టించేశారు. మరి టికెట్‌ ఇచ్చిన నాకు, పార్టీకి తుమ్మల అన్యాయం చేశారా లేక మేమే తుమ్మలకు అన్యాయం చేశామా?మీకే తెలుసు. ఇటువంటి రాజకీయ అవకాశవాదులకు, ధనమదంతో విర్రవీగేవారికి మీరే ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. డబ్బు, మద్యం పంచిపెట్టి ఎన్నికలలో గెలవవచ్చని భావిస్తున్న ఇటువంటి నేతలకు మీరే గడ్డి పెట్టాలి. 

తెలంగాణ ఏర్పడక మునుపు తెలంగాణ పరిస్థితి ఏవిదంగా ఉంది? ఈ తొమ్మిదిన్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం జిల్లా ఏవిదంగా అభివృద్ధి చెందాయో మీకు తెలుసు. కనుక ఈ అభివృద్ధి కొనసాగాలనుకొంటే బిఆర్ఎస్ పార్టీకే మళ్ళీ ఓట్లు వేసి గెలిపించమని మీ అందరినీ కోరుతున్నాను,” అని అన్నారు.