
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్ళి మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తన ఆమోదం, ప్రమేయం లేకుండానే ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లోకి వస్తుండటంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “వారు కాంగ్రెస్ పార్టీలోకి వద్దామనుకొన్నారు. ఎప్పుడు రావాలో కూడా వారే డిసైడ్ చేసుకొన్నారు...” అంటూ తన మనసులో అసంతృప్తిని బయటపెట్టేశారు.
కానీ మళ్ళీ వెంటనే సర్దుకొని బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలందరూ, మోడీ ప్రభుత్వం కేసీఆర్‌ని గద్దె దించగలదనే నమ్మకంతోనే చేరారు. అయితే కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే ఆయనపై మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోగా రెండు పార్టీలు ఆ సంపదను పంచుకు తింటున్నాయి. బీజేపీ తీరు సహించలేకనే అందులో చేరిన నేతలందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్నారు. వారందరూ మొదటి నుంచి కాంగ్రెస్‌వాదులే కనుక వారికి కాంగ్రెస్ పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతోంది,” అని అన్నారు.
గురువారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకొగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో మళ్ళీ ‘కాంగ్రెస్ పులి’ బయటకు వచ్చి గర్జించడం ప్రారంభించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్ష పదవి అనేది శాస్విత పదవి కాదు. రెండు నెలల తర్వాత ఆ పదవిలో మరెవరైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది. అంతవరకు ఎవరికి వారు మేమే ముఖ్యమంత్రి అవుతామని అనుకొంటే అభ్యంతరం లేదు,” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి వ్యంగ్యంగా అన్నారు.