మాకు బైనాక్యులర్ వద్దు: వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల చిహ్నంగా బైనాక్యులర్ గుర్తు కేటాయించింది. కానీ అది తమకు వద్దని తమకు బంతి, అగ్గిపెట్టె గుర్తులలో ఏదైనా కేటాయించమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు వైఎస్ షర్మిల లేఖ వ్రాశారు.

మొదట ఆమె తమ పార్టీకి నాగలి గుర్తు కేటాయించాలని దరఖాస్తులో కోరారు. కానీ అప్పటికే ఆ గుర్తు వేరే వారికి కేటాయించడంతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమె పార్టీకి బైనాక్యులర్ గుర్తుని కేటాయించింది. కానీ ఆమె దానిని వద్దనుకొంటున్నారు.

తాను పాలేరుతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పారు. తన భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ కూడా ఎన్నికలలో పోటీ చేస్తారని వైఎస్ షర్మిల ప్రకటించారు. తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దపడిన ఆమె, అది కుదరకపోవడంతో తమ పార్టీ 119 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు. కానీ ఇంతవరకు సగం మంది అభ్యర్ధులను కూడా ఖరారు చేయలేకపోయారు. మరి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తామని ఎలా భావిస్తున్నారో ఆమెకే తెలియాలి. అటువంటప్పుడు ఏ గుర్తు అయితేనేమిటి?