ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసి పడి ఉండమంటే ఎలా?కూచుకూళ్ళ

ఎమ్మెల్సీ కూచుకూళ్ళ దామోదర్ రెడ్డి బిఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా సిఎం కేసీఆర్‌కు పంపించారు. దానిలో ఆయన కేసీఆర్‌ వైఖరిని, పార్టీ తీరుని తప్పు పట్టారు.

"బిఆర్ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ పదవి అంటే కారుకి ఎమ్మెల్సీ స్టిక్కర్ వేయించుకొనేందుకే తప్ప ఆ పదవికి మరే విలువ ఉండదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడేందుకు ప్రతీ 15-20 రోజులకు ఆయనను కలుస్తుండేవాడిని. కానీ కేసీఆర్‌ ఈ నాలుగున్నరేళ్ళలో ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

దీనికి తోడు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కూడా సమస్యలున్నాయి. వీటన్నిటి గురించి కనీసం కేటీఆర్‌కు చెప్పుకొందామన్నా అవకాశం ఇవ్వలేదు. పార్టీకి నా అవసరంలేనప్పుడు దానిలో కొనసాగి ప్రయోజనం ఏమిటి? అందుకే రాజీనామా చేస్తున్నాను," అని దామోదర్ రెడ్డి చెప్పారు. 

ఆయన తన కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనుక ఆయన కూడా నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనప్రాయమే.