తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మూడు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్స్ మొదలుపెట్టాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు మొదలైనప్పుడు ఆయన వాటిని ఖండించారు. కానీ చివరికి తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఇప్పుడు బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు డికె అరుణ కాంగ్రెస్ గూటికి తిరిగి రాబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా వాటిని ఖండించారు. ఇది కాంగ్రెస్ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ అని తాను బీజేపీని వీడనని చెప్పారు. కానీ చివరికి ఆమె కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలాగే కాంగ్రెస్ గూటికి చేరుకొంటారో లేదో త్వరలో తెలుస్తుంది.
తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేరు వినిపిస్తోంది. ఆయన టిడిపిని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ పుకార్లు కూడా ప్రత్యర్దులు ఆడుతున్న మైండ్ గేమా లేక నిజంగానే ఆయన టిడిపిని నడిరోడ్డున విడిచిపెట్టి వెళ్ళిపోతారో త్వరలో తెలుస్తుంది.
ఈసారి టిడిపి 89 స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దమవుతోందని, చంద్రబాబు నాయుడు ఆమోదం తీసుకొని నేడో రేపో అభ్యర్ధుల జాబితా విడుదల చేయబోతోందని ఓ పక్క వార్తలు వినిపిస్తుంటే, ఈసారి ఎన్నికల బరిలో నుంచి టిడిపి తప్పుకొందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కనుక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీటిలో ఏవి నిజమో... ఏవి మైండ్ గేమ్స్ అనేవి క్రమంగా తేటతెల్లమవుతాయి.