కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో నేతలు పదవులు ఎప్పుడూ కీచులాడుకొంటూనే ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేటికీ ఎన్నికలకు 119 మంది అభ్యర్ధులను ప్రకటించలేకపోయింది. కానీ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నవారి జాబితా మాత్రం పెరుగుతూనే ఉంది.
ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేసులో ఉండగా ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో నిన్న సద్దుల బతుకమ్మ వేడుకలలో జగ్గారెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను కూడా ముఖ్యమంత్రి పదవికి అన్ని విదాల అర్హుడినే. ఒకవేళ ఇప్పుడు కాకపోతే మరో పదేళ్ళలోనైనా నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవడం ఖాయం,” అని అన్నారు.