ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు బిఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మద్యకు మారడంతో రెండు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకొంటున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచేసుకొందని చెపుతూ, కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీలో ఎలిజిబిత్ రాణీలా వ్యవహరిస్తుంటారని ఎద్దేవా చేశారు.
ఎలాంటి విమర్శలనైనా, వ్యాఖ్యలనైనా సమర్ధంగా తిప్పికొట్టగల కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “జీవన్ రెడ్డిగారు. కాస్త సోయి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరన్నట్లు నేనేమీ క్వీన్ ఎలిజిబిత్ కాను. నేను ఇక్కడే తెలంగాణ గడ్డ మీదే పుట్టి పెరిగాను. బిఆర్ఎస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తను మాత్రమే. నేను మీ అధినేత్రి సోనియా గాంధీలాగ ఇటలీ నుంచి రాలేదు. ఇటలీకి రాణిని కాను.
ఆమెలాగ తెలంగాణ కోసం వందలాది మందిని బలితీసుకోలేదు. కానీ మీ కాంగ్రెస్ నేతలందరూ ఆత్మగౌరవం చంపుకొని నేటికీ ఆమెకు గులాములుగా ఉండిపోయారు. ఢిల్లీ నుంచి వచ్చిన మీ నాయకులు బతుకమ్మని అవమానించినా మీకేమి తప్పుగా అనిపించలేదు. సోనియా, రాహుల్, ప్రియాంకాలకు గులాములు బ్రతికే మీరా నన్ను విమర్శించేది?” అంటూ కల్వకుంట్ల కవిత ఘాటుగా బదులిచ్చారు.