అప్పుడు టికెట్‌ ఇస్తామని వెంటపడ్డారు కానీ ఇప్పుడు...

ప్రజా గాయకుడు గద్దర్ చనిపోయినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు వచ్చి శ్రద్దాంజలి ఘటించారు. వారిలో కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల అంగీకరిస్తే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ టికెట్‌ ఇస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలన్నారు. కానీ అప్పుడు టికెట్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ నేతలు ఆ తర్వాత మొహం చాటేశారని గద్దర్ భార్య విమల అన్నారు. తన కుమార్తెకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే స్థానిక ప్రజలు తప్పకుండా గెలిపిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. 

వారి కుమార్తె వెన్నెల మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్నగారు పోయినప్పుడు నన్ను ఎన్నికలలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు కోరడంతో మా నియోజకవర్గంలో అందరూ నేను పోటీ చేయబోతున్నాననే అనుకొంటున్నారు. నేను కంటోన్మెంట్‌లోనే పుట్టి పెరిగాను కనుక నేను పోటీ చేస్తే వారి సమస్యలన్నీ పరిష్కరించగలనని భావిస్తున్నారు. అందుకే కంటోన్మెంట్‌లో ఎవరు కలిసినా ఎన్నికలలో పోటీ చేస్తున్నావుగా?అని అడుగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. లేకుంటే లేదు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే స్థోమత మాకు లేదు,” అని చెప్పారు.