శాసనసభ ఎన్నికలలో కారు గుర్తు పోలిన ఎన్నికల చిహ్నాలను ఇతర అభ్యర్ధులకు కేటాయిస్తుండటంపై బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖ వ్రాయగా పట్టించుకోలేదు. దాంతో బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.
రొట్టెల పీట-కర్ర, రోడ్డు రోలరు, ఆటో రిక్షా, లారీ, కెమెరా తదితర ఎన్నికల చిహ్నాలు కారు గుర్తుని పోలి ఉండటంతో, గ్రామీణ ఓటర్లు గందరగోళానికి గురై, కారు గుర్తుకు బదులు వేరే వాటికి వేస్తున్నారని, దాని వలన ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగోతోందని బిఆర్ఎస్ పిటిషన్‌లో పేర్కొంది. కనుక కారు గుర్తుని పోలిన ఎన్నికల చిహ్నాలను ఇతరులకు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను ఆదేశించవలసిందిగా కోరింది.
జస్టిస్ పంకజ్ మిధాల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి, బిఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదే కేసుపై 8 నెలల క్రితం రాష్ట్ర హైకోర్టుని బిఆర్ఎస్ పార్టీ ఆశ్రయించిందని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సుప్రీంకోర్టుకి రావడంలో మీ ఉద్దేశ్యం ఏమిటని, శాసనసభ ఎన్నికలు నిలిపివేయాలని కోరుకొంటోందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
అయినా తెలంగాణ ఓటర్లు రోడ్డు రోలరుకు, కారుకి తేడా తెలియనంత ఆజ్ఞానులేమీ కారని, వారికి చక్కటి రాజకీయ చైతన్యం ఉందని చెపుతూ సుప్రీంకోర్టు బిఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది.