పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రసంగిస్తూ, “సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా ఉంటే నేడు కేసీఆర్, కేటీఆర్ నాంపల్లి దర్గా, బిర్లా మందిర్ వద్ద బిచ్చమెత్తుకొని జీవిస్తుండేవారు. కానీ వారి చేతికి తెలంగాణ అందడంతో కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్లు ఆస్తులు పోగేసుకొన్నారు. పదివేల ఎకరాల భూములు సంపాదించుకొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసింది వారి కుటుంబం కోసమా?ప్రజల కోసమా?” అని ప్రశ్నించారు.
“కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నాశనం చేస్తే తానే బాగుచేశానని కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారు. నాగార్జున సాగర్, జూరాల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులన్నీ కేసీఆర్ వచ్చాక కట్టించారా?ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో కట్టినవేగా?మరి తెలంగాణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఎలా అంటున్నారు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల పరీక్షలు వాయిదా పడటంతో ప్రవళిక అనే యువతి నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకొంటే ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకొందని ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆమెకు కళంకం అంటించేందుకు వెనకాడటం లేదు,” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
భూపాలపల్లి వన్ ఇన్‌క్లైన్ గని గేట్ మీటింగులో మాట్లాడుతూ, “కేసీఆర్ కుటుంబానికి తాడిచర్ల ఓపెన్ కాస్ట్ గనులలో వాటా ఉన్న మాట వాస్తవం కాదా? మరి సింగరేణి ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొంటున్నారు. సింగరేణికి జెన్ కో బకాయిలు చెల్లించకుండా తప్పించుకొంటుంటే సీఎండీ గట్టిగా నిలదీసి అడగడం లేదు. ఇలాంటి తప్పులన్నీ కప్పి పుచ్చుకొనేందుకే 8 ఏళ్లుగా ఆయనను సీఎండీగా కేసీఆర్ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాము,” అని రేవంత్ రెడ్డి అన్నారు.