
పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసి రాహుల్ గాంధీకే షాక్ ఇచ్చారు. ఉత్తర తెలంగాణపై పట్టు సాధిస్తే తప్ప ఎన్నికలలో విజయం సాధించడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో నేడు రామగుండం, పెద్దపల్లిలో పర్యటించి సింగరేణి కార్మిక సంఘాల నేతలతో ముఖాముఖీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత కరీంనగర్‌లో పాదయాత్ర చేస్తారు.
కనుక ఓ పక్క కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా వీటి కోసం ఏర్పాట్లు చేస్తుంటే రాహుల్, ప్రియాంకల పర్యటనకు కొన్ని గంటల ముందే టీపీసీసీ సభ్యుడు, ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేసి షాక్ ఇచ్చారు.
వారు విలేఖరులతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే పార్టీని భ్రష్టుపట్టించేశాడని, పార్టీలో ఉన్నవారిని కాదని బయట నుంచి దిగిన నాయకులకు టికెట్స్ అమ్ముకొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసాగిస్తుండటం వలన రాష్ట్రంలో పర్యటిస్తున్నా రాహుల్, ప్రియాంక గాంధీలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ తెలియదు.
రేవంత్ రెడ్డి కాగితం మీద ఏమి రాసిస్తే అదే వారిద్దరూ చదువుతుంటారు తప్ప రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి, పార్టీ పరిస్థితి గురించి వారికేమీ తెలియదు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా తుడిచిపెట్టేసేందుకు తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తప్ప మరెవరినీ నమ్మడం లేదు కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని రాజీనామాలు చేస్తున్నాము,” అని వారు చెప్పారు.