బుధవారం రాత్రి ములుగు జిల్లా రామానుజపురంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచేసుకొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకొన్నారు. పదివేల ఎకరాలు కబ్జా చేశారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలను కేసీఆర్ కాపీ కొట్టి ప్రకటించి మళ్ళీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ మోడీ చేతిలో కీలు బొమ్మ. అందుకే ఆయన ఎంత అవినీతికి పాల్పడినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే బీజేపీ, బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు చేతులు కలుపుతున్నాయి,”అంటూ ఇంకా అనేక తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేశారు.
“రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నవారందరికీ 250 గజాల చొప్పున నివాస స్థలాలు ఇస్తాము. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాము. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలుచేస్తున్నట్లే తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేస్తాము,” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈ సభలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “కేసీఆర్ ప్రభుత్వం ఓ పెద్ద ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలను సృష్టించి రాష్ట్రాన్ని, ప్రజలను కూడా దోచుకొంటోంది. ఉద్యోగాల భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. ఆ కారణంగా ప్రవళిక వంటి వారు నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకొంటే వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు వెనకాడటం లేదు. మంత్రులే ప్రైవేట్ కాలేజీలు, యూనివర్శిటీలను ఏర్పాటు చేసుకొని విద్యార్దులను, వారి తల్లితండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు,” అని ఆరోపించారు.
“రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంబేడ్కర్ అభయహస్తం పధకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.15 లక్షలు రుణాలు ఇస్తాము. ఆదివాసీ పంచాయతీల అభివృద్ధికి రూ.25 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందిస్తాము. నిరుద్యోగ భృతి ఇస్తాము. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. 18 ఏళ్ళు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాము,” అంటూ ప్రియాంకా గాంధీ అనేక హామీలు గుప్పించారు.