
“ఈసారి శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి రాబోతోంది” అనే రికార్డడ్ మెసేజ్ ప్రతీ బీజేపీ నోట వినిపిస్తూనే ఉంటుంది.
అయితే అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ఓట్లు వేయండని ధీమాగా అడుగుతున్న కేసీఆర్‌ని బిఆర్ఎస్ పార్టీని ఏవిదంగా ఎదుర్కొంటుంది? 119 స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్ధులున్నారా? అని అడుగుతున్న బిఆర్ఎస్ నేతలకు ఏమని సమాధానం చెపుతుంది?తెలీదు. కానీ ఈసారి మేమే గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పుకొంటోంది.
బీజేపీకి అంత ధీమా ఉన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని కలిసి మద్దతు కోరడం దేనికో అర్దం కాదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె లక్ష్మణ్ ఇద్దరూ నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బీజేపీకి మద్దతు ఈయవలసిందిగా కోరారు. పార్టీలో చర్చించుకొని సమాధానం చెపుతానని పవన్ కళ్యాణ్ వారిని పంపించేశారు.
నిజానికి ఏపీలో బీజేపీ-జనసేనల మద్య నేటికీ పొత్తు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పోటీ చేస్తామని ప్రకటించేశారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు.
కనుక ఏపీలో రెండు పార్టీల మద్య పొత్తులు ఉంటాయో లేదో చెప్పడం లేదు కానీ తెలంగాణలో బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని కోరుతోంది. తెలంగాణలో జనసేన 32 స్థానాలకు పోటీ చేయబోతోంది. మరి బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే వాటి సంగతేమిటి?జనసేనతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి అంగీకరిస్తుందా? బీజేపీయే చెప్పాలి.