తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిన తర్వాత పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఆగ్రహావేశాలతో రాజీనామాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో దిగిన పారాచూట్ నేతలకు రేవంత్ రెడ్డి టికెట్స్ అమ్ముకొన్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఇప్పుడు మిగిలిన 64 మంది అభ్యర్ధులతో తుదిజాబితాని ఈ నెల 21న విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 15న మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచి హైదరాబాద్‌లో గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రెండో జాబితా విడుదల చేస్తే ఇంకెంత మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తారో, పార్టీలో ఇంకెంత అల్లకల్లోల్లం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా ధైర్యంగా ముందుకు సాగగలుగుతున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో 8 నియోజకవర్గాలలో బస్సు యాత్రలలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు వస్తున్నారు. ముందుగా ఇద్దరూ వరంగల్ రామప్ప గుడిని సందర్చించుకొన్న తర్వాత ఇద్దరూ బస్సులో ములుగు జిల్లా కేంద్రానికి చేరుకొని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు.