కొనసాగుతున్న కాంగ్రెస్‌, బిఆర్ఎస్ నేతల కప్పగంతులు

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలలో టికెట్లు దొరకని నేతలు తీవ్ర అసంతృప్తితో పార్టీలను వీడి ఎదుట పార్టీలో చేరుతున్నారు. రేవంత్‌ రెడ్డి టికెట్స్ అమ్ముకొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి ఈరోజు మెదక్ నియోజకవర్గంలో జరిగే సభలో కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. 

లక్సెట్టి పేట జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముత్తే రాజ్‌కుమార్‌ తదితరులు ఈరోజు కేటీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ పార్టీలో చేరిపోయారు. 

ఈరోజు ఉదయం హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మైనార్టీ నేతలు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నేత అరికెల నర్సింహా రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ దంపతులతో పాటు మరో 8 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. మాజీ మంత్రి మండవ వేంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 

అయితే కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలెవరూ పార్టీని వీడుతున్నవారిని చూసి ఆందోళన చెందుతున్నట్లు లేదు. అందరూ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నారు. 

సిఎం కేసీఆర్‌ నేడు జడ్చెర్ల, మెదక్ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొనబోతున్నారు. మళ్ళీ దసరా పండుగ ముగిసిన తర్వాత ఈనెల 25నుంచి నవంబర్‌ 8వ తేదీ వరకు రోజుకి రెండు లేదా మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల సభలు నిర్వహించబోతున్నారు.