సిఎం కేసీఆర్ మంగళవారం సిద్ధిపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, “ఈ సిద్ధిపేట నన్ను ముఖ్యమంత్రిని చేసింది. కనుకే సిద్ధిపేట రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. సిద్ధిపేట ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలే నన్ను తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్: 1 స్థానంలో నిలిపేలా చేసింది.
నా చిన్నప్పుడు మా అమ్మ ఆరోగ్యం దెబ్బ తింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలిచ్చింది. ఆమె రుణం ఎన్నటికీ తీర్చుకోలేను.
సిద్ధిపేటలో ప్రతీ గ్రామంలో, గల్లీలో తిరిగాను. సిద్ధిపేటలో ప్రారంభించిన మంచినీళ్ళ పధకమే మిషన్ భగీరధకు స్పూర్తి. ఒకప్పుడు సిద్ధిపేటకు ట్యాంకర్లలో నీళ్ళు తెప్పించుకొనే వాళ్ళమని అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ లోయర్ మానేరు డ్యామ్‌తో జలజాతర చేసుకొన్నాము.
ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఎన్నడూ నీటికి కరువే ఉండదు. మళ్ళీ ఎన్నడూ కరువు అనే పదం కూడా వినాల్సిన అవసరం ఉండదు మనకి. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసుకొన్నాము. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు మాయమాటలు చెప్పడానికి వస్తారు. వారి మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని మరిచిపోవద్దు. కనుక ఈ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలనుకొంటె అందరూ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలి,” అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెపుతున్న ఈటల రాజేందర్, నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లను ఆకర్శించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బహుశః అందుకే కేసీఆర్ తన ప్రసంగంలో ‘ముదిరాజ్ తల్లి పాలు తాగాను’ అంటూ గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించిన్నట్లున్నారు.