
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బిఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఈ విషయంలో బీజేపీ ఇంకా వెనకబడి ఉంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశంలో అభ్యర్ధుల తొలి జాబితాను ఖరారు చేయబోతున్నారు. కనుక వీలైతే ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో సుమారు 30-40 మంది పేర్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
బీజేపీ అభ్యర్ధులను ప్రకటించడంలో ఆలస్యం అవుతున్నప్పటికీ రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ పెద్దలు రాష్ట్రంలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీకి ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి? అనే బిఆర్ఎస్ నేతల ప్రశ్నకు బీజేపీ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతోంది. ఎంతసేపు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, మజ్లీస్‌తో దోస్తీ, మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిపదంలో దూసుకుపోతోందని చెప్పుకొంటున్నారు కానీ బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలో బలమైన కారణం చెప్పలేకపోతున్నారు. బహుశః ఎన్నికల మ్యానిఫెస్టో సిద్దమైతే జవాబులు లభిస్తాయేమో?