బిఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్... ఈసారి పటాన్ చెరులో!

బిఆర్ఎస్ పార్టీలో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు రాజీనామాలు చేస్తునే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నీలం మధు ముదిరాజ్ ఇవాళ్ళ (సోమవారం) పార్టీకి రాజీనామా చేశారు. మధు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొన్నారు. 

కేసీఆర్‌ నిన్న అభ్యర్ధులకు బీ-ఫామ్స్ ఇచ్చేవరకు కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ పటాన్ చెరు నుంచి సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికే కేసీఆర్‌ నిన్న బీ-ఫామ్ ఇవ్వడంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు.

కేసీఆర్‌కు పంపిన రాజీనామా లేఖలో తాను బిఆర్ఎస్ పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డానో వివరించి, అయినా పార్టీలో తనకు న్యాయం జరగనందుకు ఆవేదనతో పార్టీని వీడుతున్నానని వ్రాశారు. 

అనంతరం నీలం మధు ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ, “మహిపాల్ రెడ్డి ఓ అవినీతిపరుడు. నియోజకవర్గాన్ని దోచుకొంటూ, మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా ఇన్నాళ్ళు పార్టీ కోసం సహించాను. కానీ కేసీఆర్‌ అవినీతిపరులనే కోరుకొంటారని అర్దమైపోయింది. బీసీలకు గౌరవం లేదని తేలిపోయింది. అందుకే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి, కేసీఆర్‌కు మహిపాల్ రెడ్డికి నా సత్తా ఏమిటో చూపించాలని నిర్ణయించుకొన్నాను,” అని అన్నారు.