కాంగ్రెస్ పార్టీకి రాజినామా చేసి బయటకు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆయన సిద్దంగానే ఉన్నారు కనుక వెంటనే అంగీకరించారు. ఎల్లుండి సోమవారం జనగామలో జరుగబోయే బిఆర్ఎస్ సభలో సిఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల గులాబీ కండువా కప్పుకొని కారెక్కబోతున్నారు.
పొన్నాలతో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “అమెరికాలో నాసాలో ఇంజనీరుగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీలో దశాబ్ధాలుగా పనిచేసిన పొన్నాల వంటి సీనియర్ నాయకుడి విలువను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడారు. కానీ అటువంటి మేధావి, సీనియర్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం. కనుక కేసీఆర్ సూచన మేరకు నేను పొన్నాల ఇంటికి వచ్చి మా పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన కె.కేశవరెడ్డి, డి.శ్రీనివాస్, దానం నాగేందర్ వంటి అనేకమందిని గౌరవంగా చూసుకొంటున్నాము. పొన్నాలకు కూడా తగిన పదవి, ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పాను. ఆయనకు జనగామ టికెట్ ఇవ్వగలమా లేదా అనే విషయం రేపు ఆయన సిఎం కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాతే తెలుస్తుంది. కనుక అంతవరకు జనగామ టికెట్ విషయంలో ఊహాగానాలు చేయవద్దని మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.