మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు సిద్దపడుతుండటంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ళ అనుబందం ఉందని గొప్పగా చెప్పుకొంటున్న పొన్నాల ఈ వయసులో పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు సిద్దపడుతున్నందుకు సిగ్గుపడాలి. పార్టీ ఆయనకు ఏమి తక్కువ చేసింది?అనేకసార్లు ఎమ్మెల్యేని చేసింది. మంత్రి పదవి ఇచ్చింది. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చి గౌరవించింది.
పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించి ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోందనే కుంటిసాకుతో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. ఇందుకు పార్టీకి క్షమాపణ చెప్పుకొని ఆయన నిర్ణయంపై పునరాలోచించుకొంటే గౌరవంగా ఉంటుంది. కాదని బిఆర్ఎస్ పార్టీలో చేరితే అక్కడా అవమానాలు తప్పవు. ప్రజలు కూడా ఆయనకు తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.