2.jpg)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి, పార్టీలో అత్యంత సీనియర్, మాజీ పిసిసి అధ్యక్షుడుగా చేసిన పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తోంది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి చిరకాలంగా సేవలందించాను. కానీ నాకు పార్టీలో ఎటువంటి గౌరవమూ లేదు. పార్టీ టికెట్ల కేటాయింపు అంతా పెద్ద వ్యాపారంగా మార్చేశారు. టికెట్ల కేటాయింపులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపై పార్టీలో మాట్లాడుదామంటే అవకాశం లేకుండా చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ బీసీలు అండగా ఉంటారు. కానీ ఈసారి ఎన్నికలలో వారికి ఎక్కువ సీట్లు కేటాయించాలని మేము కోరుతుంటే, ఒక్కో నియోజకవర్గానికి ఇంత ధర అని టికెట్లు అమ్ముకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ అవాంఛనీయ పరిణామాల గురించి మా అధిష్టానానికి తెలియజేయాలనుకొంటే వారు నన్ను పట్టించుకోలేదు.
కనుక పార్టీలో గౌరవం లేనప్పుడు ఇంకా కొనసాగడం అనవసరమని భావించి, తీవ్ర ఆవేదనతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఈ బందం తెంచుకొంటున్నాను. నేను వేరే పార్టీలో చేరాలనుకోవడం లేదు. త్వరలోనే నా భవిష్య కార్యాచారణ ప్రకటిస్తా,” అని అన్నారు.
పొన్నాల లక్ష్మయ్య 2014 ఎన్నికల వరకు పిసిసి అధ్యక్షుడుగా ఉండేవారు. అప్పుడు పార్టీలో అందరూ కలిసి ఆయన కుర్చీ కింద మంట పెట్టడంతో దిగిపోవలసి వచ్చింది. ఈసారి ఎన్నికలలో పార్టీ నుంచే బయటకు వెళ్లిపోతున్నారు పాపం పొన్నాల.
పొన్నాల బిఆర్ఎస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ పార్టీలో జనగామ సీటును ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఖరారు చేశారు. కనుక ఆ పార్టీలో చేరినా పొన్నాలకు జనగామ టికెట్ లభించే అవకాశం లేదు. అదే... బీఎస్పీ, బీజేపీ లేదా తెలంగాణ జన సమితి పార్టీలలో చేరితే తప్పకుండా అవకాశం లభిస్తుంది. పొన్నాల మరి దేనిలో చేరుతారో?