వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ 119 స్థానాలకు పోటీ చేయబోతోందని ప్రకటించారు. గురువారం లోటస్ పాండ్లో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే మన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే మళ్ళీ కేసీఆర్ కుటుంబమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అలా జరగకూడదనే నేను గత నాలుగు నెలలుగా విలీనం కోసం ప్రయత్నించాను. కానీ కుదరలేదు. కనుక ఇప్పుడు మనల్ని ఎవరూ నిందించలేరు.
ఈసారి ఎన్నికలలో మన పార్టీ 119 స్థానాలకు పోటీ చేయబోతోంది. నేను పాలేరు, మరో చోటి నుంచి కూడా పోటీ చేయబోతున్నాను. అలాగే విజయమ్మగారు, అనిల్ గారు కూడా ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. మనం ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకొన్నాము కనుక నేటి నుంచే మన పార్టీ తరపు పోటీ చేయాలనుకొన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని గెలిపించుకొందాము,” అని అన్నారు.
పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఖరారు చేసేశారు కనుక పాలేరు నుంచి ఆమె, బిఆర్ఎస్ అభ్యర్ధిగా కందల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా తుమ్మల నాగేశ్వర రావు, బీఎస్పీ అభ్యర్ధిగా అల్లిక వెంకటేశ్వర్ రావు పోటీ చేయబోతున్నారు.