మేడ్చల్ నుంచి ఈటల జమున పోటీ?

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భార్య ఈటల జమున కూడా ఈసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఈటల రాజేందర్‌ మళ్ళీ హుజూరాబాద్ నుంచే పోటీ చేయబోతుండగా, జమున మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు.

ఈటల రాజేందర్‌ దంపతులకు మేడ్చల్ నియోజకవర్గంలో కోళ్ళ ఫారాలు, గోదాములు, వ్యవసాయ భూములు, వ్యాపారాలు వగైరా ఉండటంతో స్థానిక ప్రజలతో, ముఖ్యంగా కుల సంఘాల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం వలన వారి మద్దతు ఆమెకే లభిస్తుంది.

పార్టీలో టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన అభ్యర్ధులతో పోలిస్తే ఈటల దంపతులు ఆర్ధికంగా కూడా చాలా బలంగా ఉన్నందున ఈసారి ఈటల జమునను మేడ్చల్ నుంచి బరిలో దించేందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా త్వరలోనే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించబోతోంది.