ఒకరూ ఇద్దరూ కాదు... 20 మందిపై వేటు!

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది. అప్పుడే 20 మంది అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల కమీషన్ వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలు బుధవారం పంపింది. 

వారిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, నిర్మల్ జిల్లా కలెక్టర్ కె. వరుణ్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ డి.ఆమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఉన్నారు. 

పోలీస్ కమీషనర్లలో సివి ఆనంద్ (హైదరాబాద్‌), ఏవి రంగనాధ్ (వరంగల్), వి.సత్యనారాయణ (నిజామాబాద్‌) ఉన్నారు. 

సంగారెడి, కామారెడ్డి, జగిత్యాల్;ఆ, మహబూబ్ నగర్‌, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట ఎస్పీలను ఎన్నికల విధులను కేంద్ర ఎన్నికల కమీషన్ తప్పించింది.          టికె. శ్రీదేవి (వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్), కెఎస్.శ్రీనివాసరాజు (రవాణాశాఖ కార్యదర్శి), మహ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ (అబ్కారీశాఖ డైరెక్టర్)లను కూడా విధులను తప్పించింది. 

వీరందరి స్థానంలో వేరేవారిని నియమించి ఆ జాబితాను ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా పంపించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లను సూచించాలని, వారి 5 ఏళ్ళ రికార్డులను కూడా సమర్పించాలని ఆదేశించింది. 

ఎన్నికల ప్రక్రియ మొదట్లోనే కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకేసారి ఇంతమంది ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించడం సామాన్యమైన విషయమేమీ కాదు. కనుక ఈసారి ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా నిఖచ్చిగా వ్యవహరించబోతోందని తొలి సంకేతం ఇచ్చిన్నట్లే భావించవచ్చు.