జానారెడ్డికి కీలక బాధ్యతలు… అందుకు సరైనవారే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ కోసం గాంధీ భవన్‌ లోపలా, బయటా కూడా ధర్నాలు, దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక పార్టీలో సీనియర్స్ సైతం తమకు, తమ భార్యాపిల్లలకు టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారిలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు కె జానారెడ్డి కూడా ఒకరు. ఆయన తనకు ఎంపీ సీటు, తన ఇద్దరు కుమారులకు రెండు శాసనసభ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అత్యంత సీనియర్ నాయకుడైన ఆయనకు ఎలా నచ్చజెప్పాలో తెలియక అందరూ తలలు పట్టుకొంటున్నారు. దీనికి కాంగ్రెస్‌ అధిష్టానం ఓ పరిష్కారం కనుగొంది. ఆయన అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మణిక్రావు ఠాక్రే, దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉంటారు. 

ఈ కమిటీ పార్టీలో టికెట్స్ కోసం ఒత్తిడి చేస్తున్న నేతలతో చర్చిస్తుంది. అలాగే ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాట్లను కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 

మూడు టికెట్స్ అడుగుతున్న జానారెడ్డికే ఈ బాధ్యత అప్పగించడం ద్వారా ఈ సమస్యను ఆయన మెడకే చుట్టిందని భావించవచ్చు. ఇప్పుడు తన ఇద్దరు కుమారులకు టికెట్స్ ఇవ్వాలో వద్దో ఆయనే నిర్ణయించి కాంగ్రెస్‌ అధిష్టానానికి చెప్పాలన్న మాట! భలే ఉంది కదా ఈ ఐడియా?

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు మాత్రమే పొత్తు పెట్టుకోబోతున్నాయి. కోదండరామ్‌ పార్టీ తెలంగాణ జన సమితి కూడా పొత్తులు పెట్టుకొదలిస్తే దానికీ ఒకటి రెండు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

కనుక ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాట్ల కంటే సొంత పార్టీలో సీట్ల సర్దుబాట్లే కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారాయి. నవంబర్‌ 3 నుంచి 10లోగా నామినేషన్లు వేయాల్సి ఉంది. కనుక ఆలోగా ఈ టికెట్స్ పంచాయితీ ముగించక తప్పదు. ఇందుకు జానారెడ్డి కంటే తగినవారు ఎవరుంటారు?