
జనగామ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిఎస్ఆర్టీసీ ఛైర్మన్గా నియమించడంతో ఆయన అలకవీడి ఆ బాధ్యతలు చేపట్టారు. కనుక ఈసారి జనగామ నుంచి తన స్థానంలో పోటీ చేయబోతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.
మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మంగళవారం జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సమావేశం జరిగింది. దానిలో కేటీఆర్ సూచన మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన అనుచరులతో సహా అందరూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకొనేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రైతుబందు సమితి అధ్యక్షుడుగా నియమించడంతో ఆయన కూడా బాద్యతలు చేపట్టి చల్లబడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న కడియం శ్రీహరికి మద్దతు తెలిపి, ఆయనను గెలిపించుకొనేందుకు అన్నివిధాలా తోడ్పడతానని ప్రకటించారు.
దీంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన సమస్యలన్నీ పరిష్కారం అయిపోయిన్నట్లే. ఇక బిఆర్ఎస్ అభ్యర్ధులు నిశ్చింతగా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు.